సీఎం జగన్ (Ap Cm Jagan)అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సీఎం జగన్ (Ap Cm Jagan)అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో 55 వేల కోట్లు, రెండో విడతలో 55 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక న్యూ ఎనర్జీ పార్క్ తో పాటు కర్నూల్, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలో విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను ఎనర్జి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 4 విడతల్లో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీనితో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇక కొత్త పాలసీలో భాగంగా పుంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు కూడా కేబినేట్ పచ్చజెండా ఊపింది. అలాగే బందర్ పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.3940 కోట్ల ఋణం తీసుకొనేందుకు అనుమతి పొందింది. 9.75 శాతం వడ్డీతో ఈ ఋణం తీసుకోనున్నారు. వైజాగ్ టెక్ పార్క్ కు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజిగా మార్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కేబినేట్ అంగీకరించింది. వైద్యారోగ్యశాఖలో రిక్రూట్ మెంట్ల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుకై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
పదవి విరమణ వయస్సు పెంపు..
యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. JSW ఇన్ఫ్రా స్ట్రక్శ్చర్ లిమిటెడ్ సంస్థకు రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తులను కేటాయించాలని నిర్ణయించారు. నామినేషన్ పద్దతిలో ఈ బెర్తులను కేటాయించారు. జేఎస్.డబ్ల్యూ సంస్థకు 250 ఎకరాల భూమిని మారిటైమ్ బోర్డు ద్వారా కేటాయించాలని కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు.
ఇక టీటీడీకి ప్రత్యేక వింగ్ ఏర్పాటుకై కేబినేట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లిగూడెంలో పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొన్ని జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాల వారీగా విభజించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు , ఒంగోలు, విజయనగరం , మచిలీపట్నం, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించనున్నారు.
Leave a Reply