రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తి గట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనల ప్రకారం రావాల్సిన బకాయిలు,
ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తి
ఎన్నికలకు ముందు కుండపోత హామీలు
వేతనాల పెంపు, పీఆర్సీ అంటూ ఊకదంపుడు
సీపీఎ్‌సను వారంలోనే రద్దు చేస్తామని వెల్లడి
కాంట్రాక్టును రెగ్యులర్ చేస్తామని ప్రకటనలు
అంగన్వాడీలకూ అధిక జీతం ఇస్తామని ఆశలు
అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్ పాలనే
వేతనాల్లో కోత.. ఏ నెలా 1న అందని జీతాలు
ఫిట్‌మెంట్‌పై తొండి.. అంగన్వాడీలకూ అన్యాయం
సీపీఎస్ రద్దు లేదు.. జీపీఎస్ అంటూ కొత్త పల్లవి
ప్రశ్నించిన ఉద్యోగులపై కేసులతో ఉక్కుపాదం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తి గట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనల ప్రకారం రావాల్సిన బకాయిలు, ఇతర అలవెన్సులు ఇవ్వకపోగా కనీసం జీతాలను కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఆయా సమస్యలపై ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగ సంఘాల నేతల గొంతు నొక్కుతోంది. 2019 ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగుల పక్షపాతినంటూ జగన్ ఘనంగా చెప్పుకొచ్చారు. సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక కనీసం సకాలంలో జీతం ఇవ్వకుండా నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచాక కళ్లుతెరిచారు. అది కూడా కొందరినే రెగ్యులర్ చేస్తూ నిబంధనల కొరడా ఝుళిపించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని నమ్మబలికిన ఆయన ఆ ఉద్యోగులకు ఇంత వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇక, కీలకమైన సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ హామీలను అటకెక్కించి ఇప్పుడు జీపీఎస్ అంటూ ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్నారు. దీనిని వ్యతిరేకించే వారిపై కేసులు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ప్రకటించి ఉద్యోగులకు వేతనం పెరుగుదల లేని పీఆర్సీ ఇచ్చారు. డీఏలు సకాలంలో ఇస్తామంటూ కోతలు కోసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ చెల్లింపు కూడా సక్రమంగా చేసిన దాఖలాలు లేవు. అంగన్వాడీ వర్కర్లకు గత ఎన్నికల ముందు తెలంగాణ కన్నా వెయ్యి అదనంగా జీతం ఇస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు తెలంగాణలో కన్నా తక్కువే ఇస్తుండడం గమనార్హం.
జీతాలపైనా మోసం
గత ఎన్నికలకు ముందు చాలీచాలని జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పుకొచ్చిన జగన్.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు దేశంలో అందరి కంటే ఎక్కువగా ఉన్నాయన్నట్లుగా ప్రజల్లో ఉద్యోగులపై విషం నింపే ప్రయత్నం చేశారు. అసలు విషయం ఏంటంటే… ఉద్యోగులు ప్రతి నెలా జీతాల కోసం ఎదరు చూడాల్సిందే. గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం కోసం ప్రతినెలా ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితే. అంతేకాదు, జీతం ఇస్తే చాలన్న పరిస్థితి తీసుకొచ్చారు.
కరువు భత్యమూ కరువాయే
కరువు భత్యం కోసం జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు కరువాచిపోయారు. డీఏలు సకాలంలో ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో రెండు డీఏలు పెండింగ్‌లో ఉంటేనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు ఎలా బతుకుతారని ప్రశ్నించిన జగన్.. అధికారంలోకి వచ్చాక అవి ఎలా ఉంటాయో కూడా ఉద్యోగులకు తెలియకుండా చేశారు.
పీఆర్సీ ఓ ఫేక్…
అధికారంలోకి రాకముందు అన్నీ ఇస్తామంటూ కోతలు కోసి, వచ్చిన తర్వాత అత్యంత ఆలస్యంగా 42 నెలలకు పీఆర్సీ ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. 12వ పీఆర్సీ వేసినా ఇప్పటికీ 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించనేలేదు. సకాలంలో పీఆర్సీలు ఇస్తామని ఎన్నికల ముందు ఓట్ల కోసం కోతలు కోశారు. పీఆర్సీ ఇవ్వడానికి చేసిన ఆలస్యం 42 నెలలు. అంటే అత్యంత ఆలస్యంగా ఇచ్చిన పీఆర్సీ ఉద్యోగుల చరిత్రలో ఇదే. గత ప్రభత్వం 11వ పీఆర్సీ కమిషన్ వేసి 20 శాతం ఐఆర్ ప్రకటించింది. అయితే, ఎన్నికల ముందు జగన్ 27 శాతం ఐఆర్ ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక దానిని ఇచ్చారు. కానీ మూడు నెలలు కోతపెట్టారు. దీంతో ఉద్యోగులకు ఒరిగిన ప్రయోజనం శూన్యం. మళ్లీ 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. వేసి రెండు నెలలైనా ఇప్పటికీ కమిషన్ బాధ్యతలు స్వీకరించలేదు.
ఫిట్మెంట్ కోత..
ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వడం దేశ చరిత్రలో ఉద్యోగులు ఎక్కడా చూడలేదు. జగన్ మాత్రం 11వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 23 శాతం ఇచ్చి రివర్స్ పీఆర్సీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు జీతం పెరగలేదు.
క్రమబద్ధీకరణ కొందరికే
ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ జగన్ దండోరా వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లు కమిటీలు, సమావేశాలతో కాలక్షేపం చేసి ఎట్టకేలకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అయితే, క్రమబద్ధీకరణ కొందరికే అయ్యేలా నిబంధనల కొరడా ఝళిపించారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బురిడీ
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని జగన్ ప్రకటించారు. అయితే, అధికారంలోకి వచ్చాక వారి ఊసేలేదు. ఇప్పటికీ వారికి సమానపనికి సమాన వేతనం అమలు కాలేదు. గతంలో ఉన్న పెంపుదలను తగ్గేలా చేశారు.
ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు
ఉద్యోగులకు సకాలంలో జీతాలు, బకాయిలు చెల్లించకుండా ఆర్థికభారం అంటూ ఇంతలా బకాయిలు పెట్టిన ప్రభుత్వం మరొకటి లేదు. 11 పీఆర్సీ బకాయిలు మొదలు, డీఏ ఎరియర్స్ తదితర చెల్లింపులు ఇప్పటికీ చేయలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. దీంతో ఉద్యోగులు ఆర్థికంగా కుదేలయ్యారు. రాష్ట్రంలోని ఒక్కో ఉద్యోగికి వారి వారి క్యాడర్‌ను బట్టి రావాల్సిన బకాయిలు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటాయని చెబుతున్నారు. ఇంతలా బకాయిలు పెట్టిన ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ రుణాలు సకాలంలో ఇవ్వడం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లింపులు లేవు. సీపీఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాల్లోను నగదు జమ చేయడం లేదు.
పీఆర్సీ ఘనంగా ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం
రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఏడాదిలోపే గత టీడీపీ ప్రభుత్వం 10వ పీఆర్సీ ఫిట్మెంట్ 43 శాతం ఇచ్చింది. జీతాలు ఒక్క నెల కూడా ఆలస్యం చేయలేదు. అయితే జగన్ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తోంది.
అంగన్వాడీలపైనా అణచివేతే
ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కరాష్ట్రం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయిలు అదనంగా రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇస్తామని జగన్ హామీల వర్షం గుప్పించారు. వారు నమ్మి జగన్ వెంట నడిచారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటింది. ఇప్పటికీ వారికి పక్క రాష్ట్రం కన్నా ఎక్కువగా పెంచిందిలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వారు నిరసనలు తెలుపుతుంటే వారిపైనా కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణిచివేస్తున్నారు.
ప్రశ్నించే ఉద్యోగులపై ఉక్కుపాదం
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నించకూడదు. సమస్యలు పరిష్కరించమని కోరకూడదు. వేతనాలు సకాలంలో ఇవ్వాలని అడగకూడదు. అలా అడిగిన ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తికట్టింది. ప్రశ్నించే వారిని కట్టడి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కక్ష సాధింపులకు పాల్పడింది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసనలు తెలిపిన సీపీఎస్ ఉద్యోగులపై కేసులు బనాయించింది. అంగన్వాడీలను అరెస్టులు చేసింది. సౌకర్యాల లేమిపై ప్రశ్నించిన ఉద్యోగులను వేధింపులకు గురి చేసింది. అంటే మొత్తంగా జగన్ అధికారంలోకి రావడానికి ప్రతిపక్షనేతగా కల్లబొల్లిమాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక తమ పట్ల కర్కశంగా వ్యవరిస్తున్నారనేది స్పష్టమవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.
Leave a Reply