AP Government EMI: సగటు ఉద్యోగి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటాడు. ఇల్లు కట్టడానికో.. వాహనం కొనడానికో ఆ రుణాన్ని వినియోగిస్తాడు. నెల జీతంలో కోత పెట్టుకుని ఈఎంఐ చెల్లిస్తాడు. ఈఎంఐకి తగ్గట్టుగా సంపాదించాలి. నెలనెలా చెల్లించాలి. లేదంటే వడ్డీ పెరుగుతుంది. అసలు, వడ్డీ కలిపి అప్పుల కుప్పగా మారుతుంది. తలకు మించిన భారం అవుతుంది. ఇది వ్యక్తి ఆర్థిక ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. దివాళా తీసేందుకు దారితీస్తుంది. ఓ వ్యక్తికైనా.. ఓ రాష్ట్రానికైనా ఇదే వర్తిస్తుంది.
ఏపీ ఆర్థిక ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని చెప్పవచ్చు. అప్పుల కుప్పగా మారిన ఏపీ.. ఇప్పుడు ఈఎంఐలు కట్టలేని దుస్థితిలో ఉందని చెప్పవచ్చు. వడ్డీతో సంబంధం లేకుండా అప్పు దొరికితే చాలన్నట్టు వ్యవహారం చేస్తున్నారు. దీంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు కడుతున్న ఈఎంఐ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సగటు మనుషుల్లాగే ప్రభుత్వం అప్పులు చేస్తూ.. ఈఎంఐలు కడుతుంటే రాష్ర్టం ఆర్ధికంగా వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది.
ఒక మనిషికైనా.. ఒక రాష్ట్రానికైనా ఆర్థిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. సాధారణం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆర్థిక అక్షరాస్యత లేకపోవడమే ప్రధానం కారణం. కానీ ప్రభుత్వాలకు అలాంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వంలో ఉద్దండులైన ఆర్థిక నిపుణులు ఉంటారు. ప్రభుత్వాన్ని నడిపేవారు కూడా ఆర్థిక అంశాల్లో ఆరితేరి ఉంటారు. కాబట్టే ఆ స్థాయిలో వారు ఉండగలుగుతారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిరోజూ రూ. 63 కోట్ల ఈఎంఐ కడుతోందన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 17,501 కోట్లు వడ్డీగా కట్టినట్టు ఒక నివేదికలో పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 2300 కోట్లు వడ్డీ చెల్లించేందుకు అదనంగా ఖర్చు అయిందంటే ఆశ్చర్యం మన వంతు అవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మరిన్ని అప్పులు రాష్ట్ర ఖజానాకు జమకానున్నాయి. మొత్తం అప్పు ఏడాదికి రూ. 48,724 కోట్లు ప్రతిపాదించగా.. కేవలం తొమ్మిది నెలల్లోనే 55,555 కోట్లు అప్పుల ఖాతాలో చేరిపోయాయి.
ఏపీ ప్రభుత్వాన్ని రోజూ వస్తున్న ఆదాయం, ఖర్చు సమానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదాయం, ఖర్చు సమానంగా ఉంటే.. అప్పులు, వాటికి వడ్డీ చెల్లించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అప్పు, వడ్డీ కట్టడానికి.. మళ్లీ అప్పులు చేయాల్సిందే.
AP Government EMI
ఆర్థిక అంశాల్లో ఏపీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయాన్ని సృష్టించడం కంటే.. తక్షణ ప్రయోజనాల కోసం పరుగెడుతోంది. ఫలితంగా అప్పులు మాత్రమే ఏపీ ప్రజలకు మిగలనున్నాయి.
పప్పులు, బెల్లాల్లా అప్పులను ప్రజలకు పంచి పెడుతున్నారు. వాటి నుంచి ఎలాంటి ఆదాయం సృష్టించడంలేదు.
కేవలం ఓటు బ్యాంకు కోసం, తిరిగి అధికారంలోకి రావడం కోసమే ఏపీ ప్రభుత్వం తహతహలాడుతోంది. ఇలాంటి వైఖరి ఏపీ ప్రజలను మరింత అగాధంలోకి నెట్టివేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Leave a Reply