విజయవాడలో బస్టాండ్‌లోకి బస్సు దూసుకెళ్లి ముగ్గురు మృతిచెందిన ఘటనలో ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
ఈ ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్ ప్రకాశంతో పాటు మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసింది.
దీనిపై సమగ్రంగా విచారించిన కమిటీ మంగళవారం నివేదికను సమర్పించింది.
బస్సు డ్రైవర్ ప్రకాశం గేరు తప్పుగా వేయడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు.
దీంతో డ్రైవర్ ప్రకాశంపై సస్పెన్షన్ వేటు వేశారు.
విధుల పర్యవేక్షణలో ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ వీవీ లక్ష్మి విఫలమయ్యారని కమిటీ నిర్ధారించింది.
నిబంధనల ప్రకారం ఆటో మేటిక్ గేర్ సిస్టమ్ ఉన్న బస్సుకు పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది.
అలా చేయకుండా సూపర్ లగ్జరీ బస్సులను నడిపే డ్రైవర్ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది.
ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి లక్ష్మి బాధ్యతారాహిత్యమే కారణమని తేలుస్తూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తేల్చింది.
దీంతో ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Leave a Reply