Ap Nayee Brahmins Ordinance వచ్చేసింది. ప్రభుత్వం వారికి ఆలయ పాలకమండళ్లలో సభ్యులుగా అవకాశం ఇచ్చింది. నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా ప్రతి పాలకమండలిలో నియామకం జరగనుంది. 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించబోతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.. తమకు దేశంలోనే అరుదైన గౌరవం దక్కిందన్నారు.
ఏపీలో నాయీ బ్రాహ్మణులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పాలకమండళ్లలో ఓ ధర్మకర్తగా నాయీబ్రాహ్మణులను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 610 ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉండగా.. వీటిలో నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా పదవి దక్కనుంది. దేవాలయ సంప్రదాయాలతో వీరికి అనుబంధం ఉందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.. అందుకే నిర్వహణలో వీరికి భాగస్వామ్యం కల్పించేలా ప్రతి ట్రస్ట్ బోర్డులో ఒకరికి సభ్యుడిగా అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులకు భాగస్వామ్యం ఉంది. ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం దేవదాయ శాఖ పరిధిలో ఐదు లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించనుంది. ఇలా మొత్తం 1,234 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఆలయాలకు పాలకమండలి నియామకం పూర్తయ్యింది.
ట్రస్టు బోర్డు నియామకాలు పూర్తైన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది. మరోవైపు దేవాదాయశాఖకు చెందిన 97 ఆలయాల్లో 1,121 మంది నాయీ బ్రాహ్మణులు క్షురకులుగా ఉన్నారు. అలాగే 1,169 ఆలయాల్లో భజంత్రీలుగా పనిచేస్తున్నారు.. మరో వందమంది చెవులు కుట్టేవారు, 500 మంది పల్లకీ మోసే విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం దక్కిందని ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య అన్నారు. సీఎం జగన్ (CM Jagan)తో పాటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించిందని.. తాము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.
అంతేకాదు ఏపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు సంబంధించి గతంలోనే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై నిషేధిస్తూ జీవీను జారీ చేసింది. రాష్ట్రంలో మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి వంటి పదాలను ఉపయోగించకూడదు. ఒకవేళ ఎవరైనా ఉపయోగిస్తే వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణించి భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తప్పవు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.