ఓ కుటుంబంలో భార్యాభర్తలకు రేషన్ కార్డు ఉంది.. వారి పిల్లల పేర్లు అందులో లేవు. మరో ఉదంతంలో పెళ్లయి అత్తింటికి వెళ్లాక పుట్టింటి రేషన్‌కార్డులో కూతురు పేరు తొలగించారు.
- రేషన్ కార్డుల్లో అనర్హుల పేరుతో నిరంతరం తొలగింపు.
- కొత్త పేర్లు చేర్చడంలో మాత్రం విపరీతమైన జాప్యం.
- అనారోగ్యంపాలైతే ఆరోగ్యశ్రీకీ అగచాట్లు.
* ఓ కుటుంబంలో భార్యాభర్తలకు రేషన్ కార్డు ఉంది.. వారి పిల్లల పేర్లు అందులో లేవు.
* మరో ఉదంతంలో పెళ్లయి అత్తింటికి వెళ్లాక పుట్టింటి రేషన్‌కార్డులో కూతురు పేరు తొలగించారు. మెట్టినింటి కార్డులో ఆమె పేరు నమోదు కావట్లేదు.
…ఇలాంటి వాళ్లు ఒక్కో జిల్లాలో సగటున 25 వేల నుంచి 30 వేల మందికి పైగా ఉంటున్నారు. అనర్హుల పేరుతోనూ, వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోవడం లేదన్న కారణంతోనూ కార్డుల రద్దు ప్రక్రియ నిరంతరం జరుగుతోంది. అర్హులైన వారి పేర్లను చేర్చే కార్యక్రమానికి మాత్రం మూడు, నాలుగేళ్లుగా మోక్షం లభించట్లేదు. దీంతో అర్హులైన వారు రేషన్ బియ్యాన్ని కోల్పోవడం ఒక్కటే కాదు చాలాచోట్ల ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యానికీ దూరమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల పైచిలుకు రేషన్‌కార్డులు ఉన్నాయి. లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.85 కోట్ల మంది. ఇందులో ప్రతి వ్యక్తికీ నెలనెలా ఆరు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు చాలామంది నూతన కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో దరఖాస్తులు అర లక్ష..
రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులు ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 56,981 ఉన్నాయి. ఇందులో ప్రస్తుత ఖమ్మం జిల్లాలోనివి 40 వేలకుపైమాటే. 2017 నుంచి ఇప్పటివరకు అనర్హుల పేరుతో ఈ జిల్లాలో 3,931 రేషన్ కార్డులను అధికారులు రద్దుచేశారు. 23,935 మంది పేర్లు తొలగించారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2017-2023 వరకు 7,203 రద్దు చేశారు. తొలగించిన పేర్ల సంఖ్య 15,661. తమ పేర్లు నమోదు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 34,967.
* కామారెడ్డి జిల్లాలో 35,161 మంది, నారాయణపేట జిల్లాలో 25,717 మంది, సంగారెడ్డి జిల్లాలో 22,014 మంది చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
* నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలంలోనే 782 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కట్టంగూరుకు చెందిన ఎస్.అశోక్ చిరుద్యోగి. నెల వేతనం రూ.ఆరు వేలే. ఆయనకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల పేర్లు రేషన్‌కార్డులో ఉన్నాయి. పిల్లల పేర్లు చేర్చేందుకు దరఖాస్తు చేసి నాలుగేళ్లయినా సమస్య తీరలేదు. వారి పేరుతో బియ్యం రావట్లేదు. రేషన్‌కార్డుల్లో పిల్లల పేర్లు, పెళ్లయిన మహిళల పేర్లు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందట్లేదు. అయితే కొన్ని మండలాల్లో తహసీల్దార్లు బీపీఎల్ కుటుంబం పేరున సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ చికిత్సకు అర్హులుగా ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాల్సి వస్తోంది.
ఎడిట్ ఆప్షన్ ఇచ్చేదెప్పుడో?
అక్షర దోషాల సవరణ, కొత్త పేర్ల నమోదు, ఇతర మార్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేస్తున్నా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఆగిపోతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. రేషన్ కార్డుల్లో మార్పులుచేర్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. గతంలో ఉండగా తర్వాత తొలగించింది. 92 లక్షల రేషన్ కార్డుల్లో కేంద్రం 57 లక్షలకు బియ్యాన్ని ఉచితంగా ఇస్తోంది. లబ్ధిదారుల సంఖ్య 1.90 కోట్ల మంది. మిగిలిన కార్డులకు సంబంధించి సబ్సిడీ బియ్యం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రేషన్ కార్డుల్లో కొత్త పేర్లను జోడిస్తే వారందరికీ ఇచ్చే రేషన్ బియ్యం సబ్సిడీ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఆ కోణంలోనే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.