అదో కుగ్రామం. ఆ పల్లెలో 196 కుటుంబాలు ఉంటాయి. 750 జనాభా ఉంటుంది. పల్లెటూరే అయినా పట్నాన్ని తలపిస్తున్నది. ఏ వీధికెళ్లినా సుందరమైన భవనాలే స్వాగతం పలుకుతాయి. విలాసవంతమైన భవనంలా ఉండే ఆ ఇండ్లలో ఎవరికి వారికి ప్రత్యేక గదులు.
CHILLI FARMING FARMERS GOOD INCOME
అదో కుగ్రామం. ఆ పల్లెలో 196 కుటుంబాలు ఉంటాయి. 750 జనాభా ఉంటుంది. పల్లెటూరే అయినా పట్నాన్ని తలపిస్తున్నది. ఏ వీధికెళ్లినా సుందరమైన భవనాలే స్వాగతం పలుకుతాయి. విలాసవంతమైన భవనంలా ఉండే ఆ ఇండ్లలో ఎవరికి వారికి ప్రత్యేక గదులు. అన్ని ఇండ్లకు చూడముచ్చటైన రంగులు. అందరి ఇండ్లూ దాదాపు ఒకే విధంగా కనిపిస్తాయి. ప్రతి ఇంట్లోనూ ట్రాక్టర్. ఆవరణలో పాడి గేదెలు, పెరట్లో గడ్డివాములు దర్శనమిస్తాయి. ఊరంతా రైతులే. అరకే ఆయుధం. వ్యవసాయమే జీవనాధారం. వారిది ఒకే మాట. ఒకే పంట. అదే తేజా రకం మిర్చి.
ఆ గ్రామ రైతులు సుమారు 995 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఎకరానికి దాదాపు 25 క్వింటాళ్లకు పైగానే దిగుబడి సాధిస్తున్నారు. ఎర్రబంగారం సాగు ఆ రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. తేజారకం మిర్చికి మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో మంచి ధర పలుకుతున్నది. దీంతో అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు, ఆ పల్లెలో ఎకరానికి రూ.50 వేలకు పైగానే కౌలు పలుకున్నది అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ పల్లె ఎక్కడుంది.? గ్రామస్తుల ఏ పంట పండిస్తున్నారు? అక్కడి భూముల కౌలుకు డిమాండ్ ఎందుకో. తెలుసుకోవాలంటే భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలోని అనంతారం గ్రామం వెళ్లాల్సిందే.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): చూడడానికి ఆ ఊరు చాలా చిన్నది. కానీ ఉన్నదాంట్లో చాలా సంపన్నమైనది. అందుకు కారణం మరేమీ కాదు. పంటల సాగులో రైతుల పట్టుదల. వారు సాగు చేసే పంటలు కూడా అంత వైవిద్యమైనవేమీ కాదు. అందరూ పండించేది ఒకే పంట. అదే తేజా మిర్చి. అదే వారిని సుసంపన్నం చేసింది. రాజులుగా తీర్చిదిద్దింది. అవును. ఆ ఊరే. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలోని అనంతారం. ‘రైతే రాజు’ అనే పదానికి పరిపూర్ణ అర్థాన్నిస్తున్నారు ఈ గ్రామ కర్షకులు. అన్నదాత అంటే బక్కచిక్క ఉంటాడని, నాగలి భుజానికి వెసుకొని వెళ్తాడని, పూరి గుడిసెల్లో జీవిస్తాడని అనుకునే మాటలకు వీరి జీవనం పూర్తి భిన్నం. ఆధునికతను, సాంకేతికతను పుణికిపుచ్చుకొని మరీ సాగు పనులు పూర్తి చేస్తున్నారు ఈ గ్రామ రైతులు. సాగంటే నష్టాల బాట కాదని. లాభాల సేద్యమని నిరూపిస్తున్నారు.
సాగులో పోటీ.
‘వ్యవసాయం దండగ’ అంటూ ఇన్నాళ్లూ నానుడిగా ఉన్న మాటను ‘వ్యవసాయం పండుగ’ అని నిరూపిస్తున్నారు అనంతారం రైతులు. ఊళ్లో ఉన్నవి 196 కుటుంబాలు. అవన్నీ రైతు కుటుంబాలే. వ్యవసాయం తప్ప మరేమీ తెలియదు. పోటీ పడి మరీ అధిక దిగుబడి సాధించడం తప్ప మరో మాట లేదు. ఈ గ్రామంలో ప్రతి రైతుకూ కనీసం ఐదెకరాలకంటే తక్కువ పొలం లేందటే అతిశయోక్తి కాదు. ఒకవేళ కేవలం ఐదెకరాల సొంత పొలమే ఉన్న రైతు ఉంటే మరో ఐదెకరాలను కౌలుకు తీసుకొని తేజా మిర్చి సాగు చేస్తాడు. ఆరుగాలం శ్రమిస్తాడు. ఎర్ర‘బంగారాన్ని’ పండిస్తాడు. మరికొంత పొలం కోసం అధిక మొత్తంలో కౌలు చెల్లించేందుకూ వెనుకాడడు. 750 మంది జనాభా ఉన్న ఈ గ్రామం పేరుకు చిన్నదే అయినా పట్నం సొబగులు అద్దుకుంది. అన్నదాతల ఆవాసాలంటే పూరి గుడిసెలు, మట్టి గోడలు కాదు. సంపన్నులతో సమానమైన అందమైన భవనాలు.
ఊరంతా ఎర్రబంగారమే.
ఈ గ్రామ రైతులు సుమారు 995 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఎన్ని వైరస్‌లు వచ్చినా, మరెన్ని తెగుళ్లు సోకినా పంటను ప్రాణపదంగా కాపాడుకుంటారు. ఎకరానికి కనీసం 25 క్వింటాళ్లకు పైగానే దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర, డిమాండ్ వంటివి ఏటేటా పెరుగుతుండడంతో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని కౌలు ధర ఈ గ్రామంలో ఉందంటే అతిశయోక్తి కాదు. ఎకరానికి రూ.50 వేలకు పైగానే వెచ్చిస్తారనడంలో ఆశ్చర్యమే లేదు. ఈ ఏడాది ఇదే కౌలుకు రూ.80 వేల వరకు చెల్లించారనే మాటలో సందేహమే లేదు.
పట్నం సొగబులు.
పేరుకు అది పల్లెటూరే అయినా పట్నాన్ని తలపిస్తుంటుంది. రైతులందరివీ పెద్ద పెద్ద భవంతులు. ఖరీదైన జీవనం. ప్రతి ఇంట్లోనూ ట్రాక్టర్. ఆవరణలో పాడి గేదెలు, పెరట్లో పెద్ద పెద్ద గడ్డివాములు కన్పిస్తుంటాయి. విలాసవంతమైన భవనంలా ఉండే ఆ ఇళ్లలో ఎవరికి వారికి ప్రత్యేక గదులు. దర్జా జీవనం. అన్ని ఇళ్లకూ చూడముచ్చటైన రంగులు. అందరి ఇళ్లవీ దాదాపు ఒకే నమూనాలు.
Leave a Reply