EPFO on higher pension: అధిక పింఛన్‌కు సంబంధించి ఎట్టకేలకు ఈపీఎఫ్‌ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆప్షన్ బాధ్యతను ప్రాంతీయ కార్యాలయాలకు అప్పగించింది.
EPFO Unveils Procedure to Apply for Higher Pension Under Employees Pension Scheme
దిల్లీ: ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద అధిక పింఛన్ పొందే అంశంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు, సంస్థలకు ఉమ్మడి ఆప్షన్ అవకాశాన్ని కల్పించింది. అధిక పింఛన్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ఆప్షన్ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను ప్రాంతీయ కార్యాలయాలకు అప్పగించింది.
ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ సవరణ చేసింది. అలాగే, గరిష్ఠ పరిమితితో సంబంధం లేకుండా అంతకుమించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో జమ చేసేందుకు అవకాశం కల్పించింది. అధికవేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. అప్పట్లో దీనికి గడువేదీ పేర్కొనలేదు. అయితే, 2014 సవరణ నాటికి ఈ పథకంలో చేరని ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌ఓ అంగీకరించలేదు. దీంతో అప్పుడు ఆప్షన్ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆప్షన్‌కు అవకాశం ఇస్తూ ఈపీఎప్‌ఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఈపీఎఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయాలకు బాధ్యతలను అప్పగించింది. దీని ప్రకారం.
- ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించి ప్రత్యేక యూఆర్‌ఎల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.
- ఈ యూఆర్‌ఎల్ ద్వారా సభ్యులు డిజిటల్‌గా లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా లాగిన్ అయిన వారు దరఖాస్తుదారుల రసీదు నంబర్‌ను కేటాయిస్తారు.
- పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం ఆఫీసు ఇన్‌ఛార్జులు ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇన్‌ఛార్జుల నిర్ణయాన్ని ఈ-మెయిల్/పోస్ట్, ఎస్సెమ్మెస్ ద్వారా సభ్యులకు సమాచారం తెలియజేస్తారు.
- ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించి దరఖాస్తు, పేమెంట్ బకాయిలు వంటి ఏవైనా ఫిర్యాదులు ఉంటే గ్రీవెన్స్ పోర్టల్ అయిన ఈపీఎఫ్‌ఐజీఎంఎస్ (EPFiGMS)లో ఫిర్యాదు చేయొచ్చని ఈపీఎఫ్‌ఓ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
2022 నవంబర్ 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. సుప్రీం తీర్పును అనుసరించి అధిక పింఛన్‌కు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలని ప్రాంతీయ కార్యాలయాలకు సూచించింది. ఇందులో రెండు కేటగిరీ ఉద్యోగులు ఉన్నారు. 2014 సెప్టెంబర్1కి ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక పింఛనుకు ఆప్షన్ ఇచ్చినప్పటికీ గతంలో ఈపీఎఫ్‌ఓ తిరస్కరించిన వారు, వీరు ఒకటో కేటగిరీ కిందకి వస్తారు. సుప్రీం ఆదేశాలు అనంతరం డిసెంబర్‌లో వీరికి ఆప్షన్ ఇచ్చారు. 2014 ఆగస్టు 31 నాటికి ఈపీఎస్ సభ్యులుగా ఉండి అప్పట్లో ఆప్షన్ వినియోగించుకోని వారు రెండో కేటగిరీకి చెందిన వారు. వీరికి తాజాగా అవకాశం కల్పించారు. వీరు ఇప్పుడు అధిక పింఛన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఎంచుకోవచ్చు.
Leave a Reply