ప్రస్తుతం రబీ పంటకు నీరు లేదు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరికి వారు తప్పించుకోవడంతో చివరకు రైతులే బలవుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే దుస్థితి నెలకొందని, రైతులు మోస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
EAST GODAVARI FARMERS DAMAGING THEIR OWN CROPS DUE TO LACK WATER FACILITY IN EAST GODAVARI REGION
లొకేషన్: తూర్పు గోదావరి
రైతు కష్టం అంటే అది మాములుగా ఉండదు. ఆరుగాలం కష్టపడి, చమటోడ్చినా సరే ప్రకృతి కనికరించకపోతే నష్టం తప్పదు. ఇలా ప్రతీయేటా రైతు ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నాడు. మొన్నటి వరకూ ఏపీలో పంట కొనుగోలు అంతా గందరగోళంగా మారింది. పండించిన పంటను అమ్మేందుకు రైతులు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. మరలా ఇప్పుడు దాళ్వా సాగు వచ్చింది. సాగు చేద్దామంటే నీరు లేదు. నీటి మాట ఎత్తితే పట్టించుకునే నాథుడు లేడు. ఈ పరిస్థితులన్ని చూస్తుంటే అసలు రైతులకే ఇంత నష్టం ఎందుకు వస్తుందా అనే ప్రశ్న కలగ మానదు. ఇక చేసేది లేక విసుగెత్తిన రైతు ఏకంగా పొలాలను తన చేతులతో తానే నాశనం చేసుకుంటున్నాడు.
కాకినాడ జిల్లా పరిధిలోని కొన్ని మండలాల్లో ప్రస్తుతం సాగు నీటి కష్టాలు బాగా పెరిగాయి. ఇటీవల కాలంలో తాళ్లరేవు మండలంలో సాగునీరు అందని పరిస్థితితో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటలు ఎండిపోతున్నాయి. భూములు బీటలు వారుతున్నాయి. ఈ దీన స్థితిని చూస్తున్న రైతులు విసుగుతో పంటను నాశనం చేసుకుంటున్నారు.
బైక్‌తో ఎండిన పంటను తొక్కుకుంటూ పోతున్నారు. ఈ తరహాలో నిరసన తెలిపితే కనీసం ఉన్నతాధికారులు చూసైనా స్పందించి సాగునీరు అందిస్తారా అనే చిన్న ఆశ వారిచే ఇలా చేయిస్తోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో వరి పొలాలకు సాగు నీరు ఇవ్వాలని రైతులు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై ధర్నా,రాస్తారోకో కూడా నిర్వహించారు. ఈ నిరసన ఇరిగేషన్ అధికారులను తాకింది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలకు నీరు అందడం లేదనే వాదన ఉంది. దీనిపై అధికారులు మాత్రం ఇదిగో అదిగో అంటున్నారు. రైతులు పంటలను నాశనం చేసుకోవడమే కాక, జాతీయ రహదారిపై నిరసన తెలిపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు.
ఇదిలా ఉంటే పంట కాల్వలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతీయేటా వేసవి కాలంలో పంట కాలువలను శుభ్రం చేయాలి. పూడిక తీయాలి. గట్లు సరిచేయాలి. కానీ గత మూడేళ్లుగా కాల్వలను పట్టించుకున్న నాథుడు లేడు. ఇరిగేషన్ నిధులు ఏమౌతున్నాయో కూడా తెలీదు. సంబంధిత ఇరిగేషన్ శాఖాధికారులు నిధులు లేవని చెబుతున్నారు. పంటలకు సంబంధించి ప్రతీయేటా సక్రమంగా పన్నులు వసూలు చేస్తున్నారు కానీ, నీరు ఎందుకు ఇవ్వరని రైతుల నుండి ప్రశ్నలు మొదలవుతున్నాయి.
అధికారుల నుండి సమాధానం రాకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. అధికార పార్టీనేతలు ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం రబీ పంటకు నీరు లేదు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరికి వారు తప్పించుకోవడంతో చివరకు రైతులే బలవుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే దుస్థితి నెలకొందని, రైతులు మోస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Leave a Reply