ప్రస్తుత కాలంలో జనాలకు ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. షుగర్ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో.. బియ్యానికి ప్రత్యామ్నయం వైపు దృష్టి సారిస్తున్నారు. దానిలో భాగంగా జొన్నలు, రాగులు, వంటి చిరు ధాన్యాల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా చిరుధాన్యాల వినియోగం ప్రోత్సాహించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆ వివరాలు..
AP GOVT ORDERS TO DISTRIBUTE FINGER MILLET AND SORGHUM TO WHITE RATION CARD HOLDERS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త చెప్పింది. ప్రజా సంక్షేమం కోసం సరికొత్త పథకాలతో ముందుకు వస్తోన్న ఏపీ ప్రభుత్వం.. ప్రజారోగ్యం కోసం మరో ముందడుగు వేసింది. దీనిలో భాగాంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌కార్డు దారులకు శుభవార్త చెప్పింది. ప్రసుత్తం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ కార్డులపై బియ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇక మీదట రేషన్ కార్డు దారలకు ఇస్తున్న బియ్యం బదులు రాగులు, జొన్నలు సరఫరా చేయాలని జగన్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. తాజాగా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌గా రాయలసీమ జిల్లాల్లో.. రేషన్ కార్డు మీద బియ్యం బదులుగా రాగులు, జొన్నల పంపిణీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే.. తర్వాత దశల వారీగా రాష్ట్రమంతటా దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సివిల్ సప్లయిస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రేషన్ కార్డు ఉన్న వారికి.. ఒక్కో లబ్ధిదారుడికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నెలకు 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రజల ఆహారపు అలవాట్లు మారుతుండటంతో.. రేషన్ షాపుల్లో పీడీఎస్ ద్వారా బియ్యం బదులు పోషక విలువలున్న ఇతర ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనికి తోడు ఐక్యరాజ్య సమితి.. 2023ని చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించడంతో.. కేంద్రం కూడా.. చిరు ధాన్యాల వినియోగాన్ని ప్రోత్సాహించే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తోంది.
దీనిలో భాగంగా రాష్ట్రాంలో చిరు ధాన్యాల వినియోగానికి సంబంధించింది.. గత నెల 18న ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. బియ్యం కంటే రాగులు, జొన్నలకు అయ్యే ఖర్చే తక్కువ.. అలాగే ఆరోగ్యపరంగా ఎంతో మంచిది కావడంతో.. బియ్యం స్థానంలో రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. చిరుధాన్యాలప పంపిణీకి సంబంధించి ఇప్పటికే కార్డుదారుల అభిప్రాయం, సమ్మతిని తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో సానుకూల ఫలితాలు రావడంతో రాగులు, జొన్నల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది డిసెంబర్ వరకు.. రేషన్ కార్డులు ఉన్నవారికి బియ్యంతో సమానంగా రాగులు, జొన్నలను ఉచితంగానే పంపిణీ చేయనున్నారు. పంపిణీకి అవసరమైన రాగులు, జొన్నలను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించనున్నారు. దీని వల్ల చిరుధాన్యాల సాగు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Leave a Reply