Basthi Hospitals: తెలంగాణలోని పేద ప్రజలకోసం తమ ప్రభుత్వం తెచ్చిన ఉత్తమ కార్యక్రమాల్లో బస్తీ దవాఖానాలు ఒకటని మెడికల్ అండ్ హెల్త్ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి KCR దీనిని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఇవి తమ పనితీరుతో ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకుంటున్నాయని హరీష్ రావు తెలిపారు.
Health Minister Harish Rao Talked Over BASTHI Hospital Services Across Telangana as KCR S Dream
ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.800 ఖరీదు చేసే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలను 1.48 లక్షల మంది ప్రజలకు (రూ.12 కోట్ల విలువైన) బస్తీ దవాఖానాల ద్వారా ఉచితంగా చేసినట్లు వెల్లడించారు. వీటికి తోడు 1.8 లక్షల మందికి థైరాయిడ్ పరీక్షలను(రూ.8 కోట్లు విలువైన) చేసినట్లు వెల్లడించారు. బస్తీ దవాఖానాల్లో చికిత్స చేయించుకునే ప్రజలకు ప్రభుత్వం 158 రకాల మందులను ఉచితంగా అందిస్తోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రజలకు వీటిని చేరువ చేసినందున ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల కోసం రద్దీ తగ్గిందని తెలిపారు.
2019 సమయంలో ఒస్మానియా జనరల్ ఆసుపత్రికి దాదాపు 12 లక్షల ఓపీ రోగుల తాకిడి ఉండేదని.. ప్రస్తుతం ఇది 5 లక్షలకు తగ్గిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అలాగే గాంధీ ఆసుపత్రిలో సైతం రద్దీ 6.5 లక్షల నుంచి 3.7 లక్షలకు తగ్గిందని అన్నారు. దీని వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందటంతో పాటు ప్రధాన ఆసుపత్రులపై రోగుల రద్దీ తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ బస్తీ దవాఖానాల సేవలను మరింత పెంచాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మార్చి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్తీ దవాఖానాల్లో 134 వివిధ రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయని హరీష్ రావు తెలిపారు. అయితే ప్రస్తుతం కేవలం 57 రకాల పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 496 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా వాటిలో 345 సేవలు అందించటం ప్రారంభించాయి. మిగిలిన 151 కేంద్రాలు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో బస్తీ దవాఖానా కేంద్రాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. GHMC పరిధిలో 264 కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. హైదరాబాద్ అర్బన్‌లో 36, వివిధ మున్సిపాలిటీల్లో 45 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. 1540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని పేర్కొన్నారు.
Leave a Reply