Hyderabad: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రజలు ఎక్కువగా ఆరోగ్యం, సొంతింటి కలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే నెలవారీ అద్దెల భారం కూడా భాగానే పెరిగిందని తాజా అనరాక్ సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. దేశంలోని ఏడు నగరాల్లో 2BHK గృహాల అద్దె రేట్లను పరిశీలిస్తే అత్యధికంగా 23 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
Hyderabad 2bhk Monthly Rentals Increased In 2022 Know in Detail
ఇంటి అద్దెలు
2019 నుంచి 2022 మధ్య కాలంలో 1000 చదరపు విస్తీర్ణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల సగటు అద్దె గరిష్ఠంగా 23 శాతం మేర పెరిగిందని అనరాక్ తెలిపింది. అత్యధికంగా నోయిడాలోని సెక్టార్-150 ప్రాంతంలో అద్దెలు 2019లో రూ.15,500 ఉండగా ప్రస్తుతం 23 శాతం పెరిగి రూ.19 వేలకు చేరుకున్నట్లు వెల్లడైంది. అలాగే 2022లో ఏడు ప్రధాన నగరాల్లో అద్దె నివాసాలకు డిమాండ్ సైతం భారీగానే పెరిగిందని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అంజు పూరీ వెల్లడించారు.
దేశ రాజధానిలో
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని గురుగ్రామ్ లో అద్దెలు దాదాపు 14 శాతం మేర పెరిగాయి. అలాగే కోల్‌కతాలో అద్దెలు 16 శాతం పెరగగా.. టెక్ సిటీ బెంగళూరులోని సర్జాపూర్ రోడ్‌లో సగటున 14 శాతం వరకు పెరిగాయి. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో 18 శాతం వరకు అద్దెలు పెరిగాయి. ఇక పూణేలో అద్దెలు 20 శాతం వరకు పెరగగా.. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో 13 శాతం, పల్లవరంలో 17 శాతం వరకు ఇంటి అద్దెలు భారంగా మారాయి.
హైదరాబాద్ నగరంలో
ఐటీ రంగంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. హైటెక్ సీటీ ప్రాంతంలో సగటున ఇంటి అద్దె 7 శాతం పెరిగినట్లు అనరాక్ నివేదిక చెప్పింది. 2019లో రూ.23 వేలుగా ఉన్న ఇంటి అద్దె ప్రస్తుతం రూ.24,600కు చేరుకుందని వెల్లడైంది. ఇక గచ్చిబౌలి ప్రాంతోనూ అద్దెలు దాదాపు 6 శాతం మేర పెరిగాయి. గతంలో రూ.22 వేలుగా ఉన్న ఇంటి అద్దె ప్రస్తుతం రూ.23,400కు పెరిగిందని నివేదిక తెలిపింది.
హైదరాబాద్ రియల్టీ
జనవరిలో విడుదలైన వివరాల ప్రకారం హైదరాబాద్ మహానరం రియల్టీ రంగంలో కొత్త రికార్డులను సృష్టించింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ నివాస గృహాల మార్కెట్ మంచి గ్రోత్ నమోదు చేసింది. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎన్నారై కమ్యూనిటీ నగరంలోని పశ్చిమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతోంది. 2022లో 31,046 యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఏడాది ప్రాతిపధికన ఇది 28 శాతం వృద్ధిగా చెప్పుకోవాలి. కొత్త లాంచ్ లు కూడా భారీగానే ఉన్నాయి.
Leave a Reply