ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 95 శాతం పూర్తి చేసారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. బీసీ గర్జనలో చెప్పిన విధంగా ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తూ ప్రభుత్వం గజెట్ జారీ చేసింది. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని చాలా ఏళ్లుగా కోరుతున్న నాయీ బ్రాహ్మణుల ఆకాంక్షను అమలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించేలా గజెట్ జారీ అయింది.
చాలా ఏళ్లుగా ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉంది. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలన్న నాయీ బ్రాహ్మణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన జగన్ పాదయాత్ర వేళ వివరించారు. దీనికి నాడు జగన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ నిర్వహించిన బీసీ గర్జనలోనూ దీని పైన చర్చ చేసారు. ఆ హామీ అమలు చేస్తానని జగన్ స్పష్టం చేసారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు అధికారికంగా అమలు కోసం గజెట్ జారీ చేసారు.
గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో దేవాదాయ పరిధిలోని అయిదు లక్షలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయలాలకు మాత్రమే బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆలయాలు 1,234 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే బోర్డు నియామకాలు పూర్తయినవి మినహాయించి, భర్తీ చేయాల్సిన 610 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తాజాగా ఇంద్రకీలాద్రి, అన్నవరం, అరవసల్లి దేవాలయాలకు కొత్తగా పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. తాజాగా జారీ అయిన గజెట్ మేరకు ప్రతీ ఆలయంలోనూ ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ఈ దేవాలయ ట్రస్టు బోర్డులో స్థానం కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply