Income Tax: జీతం ఆదాయం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వారు కొత్త లేదా పాత టాక్స్ విధానాల్లో దేనిని పాటిస్తున్నప్పటికీ పన్ను చట్టాలలో వర్తించే తగ్గింపులు, శ్లాబ్ రేట్లకు అనుగుణంగా చెల్లించాల్సిన పన్నును గణిస్తారు.
బడ్జెట్ 2023లో.. ఫైనాన్స్ బిల్లు 2023లో నిర్మలా సీతారామన్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పన్ను మినహాయింపుపై పెద్ద ప్రకటన చేశారు. కొత్త టాక్స్ రీజిమ్ ప్రకారం గతంలో రూ.5 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపును రూ.7 లక్షలకు పెంచారు. దేశంలో ఎక్కువ మందిని పన్ను విధానం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కొత్త టాక్స్ విధానంలోని శ్లాబ్ రేట్లు పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం భావించిన తరుణంలో ఈ ప్రకటన వచ్చిందని తెలుస్తోంది. పైగా శ్లాబ్ రేట్లలో గతం కంటే మరో రూ.50,000 అధికంగా మినహాయింపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందించారు.
సున్నా ఇన్కమ్ టాక్స్.. ఎవరైనా పన్ను చెల్లింపుదారుడు తగ్గింపులు పొందటానికి వారు తప్పకుండా పాత టాక్స్ విధానాన్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త పన్ను విధానం ద్వారా ఎలాంటి తగ్గింపులను కేంద్రం అనుమతించటం లేదు. అందుకే పన్ను రేట్లు పాతదాని కంటే కొత్త దానిలో తక్కువగా ఉన్నాయి. వడ్డీ చెల్లింపుల నుంచి హెచ్ఆర్ఏ, సేవింగ్స్, సెక్షన్-80 డిడక్షన్స్ వంటి వాటిని వినియోగించుకుని ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం కలిగిన ఎవరైనా పన్ను చెల్లింపుదారుడు సున్నా ఆదాయపుపన్ను చెల్లించవచ్చు.
లభించే తగ్గింపుల వివరాలు.. ఉదాహరణకు ఇక్కడ ఉద్యోగి వార్షిక స్థూల జీతం రూ.10 లక్షలు ఉన్నట్లు తీసుకోవటం జరిగింది. ముందుగా మెుత్తం ఆదాయంలో సెక్షన్ 16(ia) కింద స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు లభిస్తుంది. దీని తర్వాత హౌసింగ్ లోన్‌పై చెల్లించిన వడ్డీ కింద గరిష్ఠంగా రూ.2 లక్షల తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు తగ్గింపుల తర్వాత టాక్స్ చెల్లించాల్సిన ఆదాయం రూ.7.5 లక్షలకు చేరుకుంటుంది.
సెక్షన్ 80 డిడక్షన్స్.. రూ.7.5 లక్షల స్థూల ఆదాయంలో నుంచి సెక్షన్ 80C కింద కొన్ని తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ముందుగా ఎల్ఐసీ ప్రీమియం కింద రూ.40,000, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్ కింద రూ.70,000, పిల్లల ట్యూషన్ ఫీజుల కింద రూ.5,000, హౌసింగ్ లోన్ తిరిగి చెల్లింపు కింద రూ.50,000 తగ్గింపు కోరినట్లయితే వీటన్నింటికీ కలిగి గరిష్ఠంగా చట్ట ప్రకారం రూ.1,50,000 తగ్గింపు లభిస్తుంది. దీని తర్వాత 80CCD(1B) కింద నేషనల్ పెన్షన్ స్కీమ్ పెట్టుబడులకు రూ.50,000, 80D కింద మెడికల్ ప్రీమియం చెల్లింపులకు గాను గరిష్ఠంగా రూ.50,000(భార్యా భర్తలకు 25 వేలు, తల్లిదండ్రులకు 25 వేలు) అనుమతించబడుతుంది. వీటన్నింటినీ తగ్గించిన తర్వాత పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5 లక్షలకు చేరుకుంటుంది.
చివరిగా టాక్స్ శ్లాబ్ ప్రకారం.. పాత టాక్స్ శ్లాబ్ రేట్ల ప్రకారం మెుత్తం రూ.5 లక్షల టాక్సబుల్ ఆదాయానికి 5 శాతం శ్లాబ్ రేటు వర్తిస్తుంది. ఈ లెక్కన రూ.5,00,000లపై రూ.12,500 టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే సెక్షన్ 87A కింద ఉన్న రిబేట్ అప్లై చేస్తే మెుత్తంగా రూ.10 లక్షల ఆదాయంపై సున్నా రూపాయల టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
Leave a Reply