Kadapa Steel Plant: వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత నగరాలు ఎలా వేగంగా అభివృద్ధి చెందాయో మనం విశాఖను చూస్తే అర్థమౌతుంది. సీఎం జగన్ కృషి నేడు కార్యరూపం దాల్చటంతో జిల్లా అంతటా అభివృద్ధి బాట పడుతుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
రెండు దశల్లో నిర్మాణం..
స్టీల్ ప్లాంట్ మరో 24-30 నెలల్లో ప్రారంభమౌతుందని జగన్ తెలిపారు. రెండు దశల్లో మూడు మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మించాలని జిందాల్ గ్రూప్ నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీ దాదాపు రూ.3,300 కోట్లను వెచ్చించనుంది. తర్వాత సెకండ్ ఫేజ్ లో భాగంగా 5 ఏళ్లలో రూ.5,500 కోట్లను జిందాల్ గ్రూప్ ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం జిందాల్ గ్రూప్ దేశవ్యాప్తంగా 28.5 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
మౌలిక సదుపాయాలు.
సముద్ర తీరానికి ప్రాంతం దూరంగా ఉన్నందున ఈ ప్లాంట్‌కు మద్ధతివ్వడానికి ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం జిందాల్ ఫ్యాక్టరీకి దాదాపు 3,500 ఎకరాల భూమిని సేకరించి అందించింది. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.700 కోట్లను రాష్ట్రా ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా 67వ నెంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే కనెక్టివిటీని సైతం పొడిగిస్తున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిసరఫరాతో పాటు విద్యుత్ సరఫరా కోసం కూడా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ప్రతి విద్యార్థికీ ఉద్యోగం..
ఈ విధంగా రాష్ట్రానికి మంచి పరిశ్రమలను తీసుకొచ్చి చదువుకున్న ప్రతి విద్యార్థికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికంగా కల్పించే దిశగా సీఎం జగన్ కృషిచేస్తున్నారు. ఇందుకోసం గతంలోనే 75 శాతం ఉద్యోగాలను స్థానిక ప్రజలకే అందించాలని ఏపీ ప్రభుత్వం ఇంతకుముందే చట్టం చేసింది. రానున్న కాలంలో జిందాల్ గ్రూప్ గ్రీన్ హైడ్రోజన్, సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను సైతం రాష్ట్రంలో ప్రారంభించాలని సీఎం ఆకాంక్షించారు.
అండగా రాష్ట్ర ప్రభుత్వం..
ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం-1 స్థానంలో ఉంది. పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన పాలసీలను తీసుకురావటంతో వైసీపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. అయితే ఈ క్రమంలో ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే తమ ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అండగ నిలుస్తుందని హామీ ఇచ్చారు.
Leave a Reply