వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జమ చేశారు. 2022 అక్టోబరు- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు..
వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జమ చేశారు. 2022 అక్టోబరు- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భరంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబరు- డిసెంబర్ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామని, ఫిబ్రవరిలో వెరిఫికేషన్ పూర్తిచేసి, ఇవాళ నేరుగా వారికి నగదు జమచేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, జనవరి- ఫిబ్రవరి- మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులో ఏప్రిల్‌లో స్వీకరిస్తామని, మే నెలలో వారికి అందజేస్తామన్నారు. ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని, పేదవాడి తలరాత మారాలంటే.. చదువు అనే అస్త్రాన్ని ఇవ్వగలిగితేనే తలరాతలు మారుతాయన్నారు సీఎం జగన్. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయికూడా ఖర్చుగా భావించడం లేదని, పిల్లలకు ఇచ్చే ఆస్తిగానే భావిస్తున్నామన్నారు. వయసు మాత్రమే కాదు, చదువు కూడా ఒక అర్హతగా ఈపథకానికి నిర్దేశించామని వ్యాఖ్యానించారు.
ఇక పెళ్లైనవారే కాకుండా వారి తర్వాత తరాలు కూడా చదువుల బాట పట్టాలనే ఇది చేస్తున్నామని, పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్యవిహాహాలను నివారించడం, స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం పెట్టామన్నారు. కనీస వయస్సు.. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లు నిర్దేశించాం.. టెన్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలని చెబుతున్నామన్నారు.
ఈ ప్రోత్సాహకం కోసం కనీసంగా టెన్త్ వరకూ తీసుకున్నామని, తర్వాత అమ్మ ఒడి ఉండటంతో సహజంగానే ఇంటర్మీడియట్ చదువుకుంటారు.. ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఉన్నాయి.. అందుకే ఇంటర్మీడియట్ నుంచి వారి చదువులు ఆగిపోకుండా ముందుకు కొనసాగుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల్లోని ఆడపిల్లలందరికీ కూడా మంచి జరుగుతుందని, వచ్చే త్రైమాసికం నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులు పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామని పేర్కొన్నారు. పలువురి సూచనలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, పెళ్లిళ్లుకోసం కొంతకాలం ఆగొచ్చు.. కానీ చదువులు ఆగిపోకూడదనేది మా ఉద్దేశమన్నారు.
అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందని, పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నామన్నారు. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలకు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. అందుకే విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో మెరుగుపరచడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నాం.. అమ్మ ఒడి, సంపూర్ణ పౌష్టికాహారం, విద్యాకానుక, బైలింగువల్ టెక్ట్స్‌బుక్, నాడు-నేడుతోపాటు, నాడునేడులో చివరి కార్యక్రమం ఆరోతరగతి పైన అన్ని క్లాసుల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, 8వ తరగతిలోకి రాగానే వారందరికీ ట్యాబ్స్, బైజూస్ కంటెంట్, సీబీఎస్‌ఈ సిలబస్, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యాదీవెన, వసతి దీవెన, ఉద్యోగాలు కల్పించేలా పాఠ్యప్రణాళిక, విదేశాల్లో అత్యుత్తమ కాలేజీల్లో సీట్లు సంపాదించేవారికి రూ.1.25 కోట్ల వరకూ వారికి సహాయాన్ని విదేశీ విద్యాదీవెన ఇస్తున్నామని వివరించారు.
గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్ సర్టిఫికేట్స్, దరఖాస్తుకు ఏర్పాట్లు:
గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్ సర్టిపికేట్స్, దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ప్రకటించారు. కానీ అమలు మాత్రం దారుణంగా ఉండేది. మంచి చేయాలన్న ఆలోచనతో చేసింది కాదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆరోజు తీసుకు వచ్చారు. అరకొరగా డబ్బులు ఇచ్చారు.. అవికూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు. 2018-19 సంవత్సరంలో 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టారు. 2018 అక్టోబరు నుంచి పూర్తిగా ఎగ్గొట్టారు. కేవలం ప్రకటనలకే ఆనాడు పథకం పరిమితమైంది. ఎస్సీలకు గతంలో రూ.40వేలు అయితే ఇప్పుడు లక్ష చేశాం.
ఎస్సీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.1.2లక్షలు చేసి అమలు చేస్తున్నాం. ఎస్టీలకు రూ.50 వేలు గతంలో అయితే.. ఇప్పుడు రూ.1 లక్ష ఇస్తున్నాం. అలాగే ఎస్టీ కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు అయితే ఇప్పుడు రూ.1.2 లక్షలు ఇస్తున్నాం. బీసీలకు గతంలో రూ.35వేలు అయితే ఇప్పుడు రూ.50 వేలు, బీసీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.50వేలు అయితే ఇప్పుడు రూ.75వేలు, మైనార్టీలకు గతంలో రూ.50 వేలు అయితే ఇప్పుడు రూ.1 లక్ష రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.1 లక్ష అని చెప్తే.. ఇప్పుడు రూ.1.5 లక్షలు, భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.40వేలు ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply