New Rules From Jan 1st : కొత్త ఏడాదిలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. లాకర్లకు కొత్త నిబంధనలు, క్రెడిట్ కార్డు రివార్డుల్లో మార్పులు వంటివి అందులో ఉన్నాయి.
From January 1 These Rules Will Come into Effect Full Details in Telugu
పాత ఏడాదికి గుడ్‌బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పటికే చాలా మంది కొత్త ఏడాదిలో ఏమేం చేయాలో నిర్ణయించుకుని ఉంటారు. ఆర్థిక విషయాల గురించీ ప్రణాళికలు రూపొందించుకుని ఉంటారు. అలాగే కొత్త ఏడాదిలో వచ్చే మార్పులు కూడా పనిలో పనిగా తెలుసుకోండి. బీమా పాలసీల కొనుగోలుకు కేవైసీ, ఎన్‌పీఎస్ పాక్షిక విత్‌డ్రా, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ సహా మరికొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో చూసేయండి..
అన్ని పాలసీలకూ కేవైసీ
2023 జనవరి 1 నుంచి కొనుగోలు, పునరుద్ధరణ చేసే అన్ని రకాల పాలసీల (జీవిత, ఆరోగ్య, మోటారు, ప్రయాణం, గృహ బీమా)కు ఐఆర్‌డీఏఐ కేవైసీ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఆరోగ్య బీమాలో రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ క్లెయిం విలువ ఉన్న వినియోగదారులు మాత్రమే కేవైసీ పత్రాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి కేవైసీ పత్రాలు తప్పనిసరి కాదు. అయితే, ఇప్పుడు అన్ని రకాల పాలసీలకు కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎన్‌పీఎస్ పాక్షిక విత్‌డ్రా రూల్స్‌లో మార్పు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాక్షిక విత్‌డ్రాల కోసం నోడల్ ఆఫీస్ ద్వారా రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పాక్షిక విత్‌డ్రాలకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది.
లాకర్లకు కొత్త రూల్స్..
బ్యాంకు లాకర్లకు సంబంధించి 2022 ఆరంభంలోనే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని ఆగస్టు నెలలో సమీక్షించి కొన్ని మార్పులు చేసింది. అవే కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లాకర్ సదుపాయం తీసుకున్న కస్టమర్లంతా తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని బ్యాంకులు సూచించాయి. లాకర్ ఒప్పందంలో ఎలాంటి అనైతిక షరతులను చేర్చడానికి వీల్లేదని కొత్త నిబంధనల్లో ఆర్‌బీఐ పేర్కొంది. పూర్తి నిబంధనల కోసం క్లిక్ చేయండి..
క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్‌లో కోత
కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా కొన్ని బ్యాంకులు తమ రివార్డు ప్రోగ్రాములో మార్పులు చేశాయి. అమెజాన్‌లో కొన్ని క్రెడిట్‌కార్డులతో కొనుగోళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన రివార్డు పాయింట్లలో కోత పెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం రివార్డు పాయింట్ల రిడీమ్ విషయంలో పరిమితులు విధించింది.
కార్ల ధరలు జూమ్
టాటా మోటార్స్, మారుతీ సుజుకీ సహా ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు సైతం కొత్త ఏడాదిలో ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో ధరలు సవరిస్తున్నట్లు తెలిపాయి. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ ధరల్లోనూ జనవరి 1న మార్పులు ఉండొచ్చు.
Leave a Reply