కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి. 18 వ పిల్లర్ నుంచి 21వ పిల్లర్ వరకు బ్రిడ్జి వంగిపోయింది. దీంతో తెలంగాణ- మహారాష్ట్ర మధ్య బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. ప్రాజెక్టులోని నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రధానాంశాలు:
కుంగిన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి
బ్రిడ్జిపై వాహనాల రాకపోకల నిలిపివేత
బ్యారేజీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోయింది. శనివారం రాత్రి బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ మెుత్తం పొడవు 1.6 కిలోమీటర్లు కాగా..ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.
గోదావరి నదిపై 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీని నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది కావటం విశేషం. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా.. అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మెుత్తం16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో ఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నీరు ఉంది. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేశారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.
రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. భారీ శబ్దం నేపథ్యంలో డ్యాం ఇంజినీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు వైపుల నుంచి పోలీసులను కాపాలాగా పెట్టారు. మరోవైపు బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ ఎల్అండ్టీకి చెందిన నిపుణులు శనివారం అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించారు. ఇవాళ ఉదయం ఇంజినీర్లు మరోసారి పరిశీలించనుండగా.. ఆ తర్వాత పిల్లర్లు కుంగటానికి కారణలు తెలిసే ఛాన్స్ ఉంది.
Leave a Reply