Farmers Pension | రైతులకు ప్రతీ నెలా రూ.3,000/- పెన్షన్ ఇచ్చే స్కీమ్ ఉంది. ఈ పథకంలో చేరిన రైతులు వృద్ధాప్యంలో పెన్షన్ పొందవచ్చు.
PM KISAN MANDHAN YOJANA FARMERS CAN JOIN IN THIS SCHEME AND GET RS 3000 MONTHLY PENSION
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Scheme) ద్వారా ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబటి సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (Kisan Credit Card Scheme) ద్వారా కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా ఇస్తోంది. రైతులకు ప్రతీ నెలా పెన్షన్ఇచ్చే స్కీమ్ కూడా ఉంది. ఆ స్కీమ్ పేరు ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PM Kisan Mandhan Yojana). ఈ స్కీమ్‌లో చేరిన రైతులు ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. మరి ఈ పెన్షన్ పథకంలో చేరడానికి అర్హతలేంటీ? ఎవరు చేరొచ్చు? స్కీమ్ నియమనిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన వివరాలు
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పేరుతో ఈ స్కీమ్ 2019లో ప్రారంభమైంది. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి సామాజిక భద్రతా పథకాల్లో లేని రైతులకు వృద్ధాప్యంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ స్కీమ్ ప్రారంభించింది. ఈ పథకంలో చేరిన రైతులకు ప్రతీ నెల రూ.3,000 పెన్షన్ చొప్పున ఏటా రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులోపు ఉన్న రైతులు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు.
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్‌లో చేరిన రైతులు ప్రతీ నెల కొంత ప్రీమియం చెల్లించాలి. ఈ ప్రీమియం రైతుల వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
రైతులకు 60 ఏళ్లు వయస్సు దాటగానే కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు. పెన్షన్ తీసుకుంటున్న రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ జీవిత భాగస్వామికి పెన్షన్ వద్దనుకుంటే చెల్లించిన డబ్బు వడ్డీతో సహా వెనక్కి వస్తుంది. ఇద్దరూ మరణించినట్టైతే నామినీకి డబ్బుల్ని చెల్లిస్తుంది ప్రభుత్వం. ఈ స్కీమ్‌లో చేరిన రైతులు తాము పథకంలో కొనసాగడం ఇష్టం లేకపోతే వారు చెల్లించిన మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది ప్రభుత్వం.
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో ఎలా చేరాలి?
అర్హులైన రైతులు దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఆధార్ నెంబర్ , బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత ప్రతీ నెలా ప్రీమియం చెల్లించాలి.
Leave a Reply