Govt Schemes: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో అద్భుత పథకాలను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పంట సాయం ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. అయితే రైతులకు మరో అద్భుత పథకం ఉంది. ఇందులో సాగుకు అవసరమైన ట్రాక్టర్‌ను సగం ధరకే దక్కించుకోవచ్చు. ఎలాగో పూర్తి వివరాలు చూద్దాం.
Farmers: రైతులను ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుత పథకాలు తీసుకొచ్చింది. వివిధ రకాలుగా చేయూతను అందిస్తూ అన్నదాతకు భరోసా కల్పిస్తుంది. అయితే గతంతో పోలిస్తే వ్యవసాయంలో ఆధునికీకరణ, పెరుగుతున్న సాంకేతికత కారణంగా సాగు చేసేందుకు యంత్రాల వినియోగం విపరీతంగా పెరగడం మనం గమనించొచ్చు.
రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ట్రాక్టర్ ప్రధానమైనది. దుక్కి దున్నడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలకు ట్రాక్టరే ఎక్కువగా అవసరం పడుతుంది. కానీ దీనిని కొనుగోలు చేయడం మాత్రం రైతులకు ఇప్పటికీ భారంగానే ఉంది. లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్ కొనాలంటే.. భయపడుతుంటారు. వారికి కూడా కేంద్రం మద్దతు ఇస్తోంది. రైతులు సగం ధరకే ట్రాక్టర్‌ను సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అమలు చేస్తోంది. ఇదే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన (Pradhan Mantri Tractor Yojana). అసలు ఈ పథకం ఏంటి.. దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్లు కావాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం ట్రాక్టర్ యోజన అంటే?
అన్నదాతకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ట్రాక్టర్ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు 50 శాతం తక్కువ ధరతో (సబ్సిడీతో) ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. ధర మొత్తంలో సగం చెల్లిస్తే చాలు ట్రాక్టర్ కొనే వీలు కల్పిస్తోంది కేంద్రం. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలే నోడల్ ఏజెన్సీగా ఉంటాయి.
ఎవరు అర్హులు.. సొంత పొలం ఉండాలా?
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న, సన్నకారు రైతు కూడా పీఎం ట్రాక్టర్ యోజన పథకానికి అర్హుడే. ఇక ఈ స్కీం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు మాత్రం 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. సొంత పొలం లేకున్నా పర్లేదు.. కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందనేది గుర్తుంచుకోవాలి. కౌలు రైతులు.. యజమాని నుంచి NOC తీసుకోవాల్సి ఉంటుంది.
రూ. 1.50 లక్షలు దాటొద్దు!
పీఎం ట్రాక్టర్ స్కీంకు దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. అప్లికేషన్ పెట్టుకున్న రైతు .. అర్హుడైతే అతనికి సగం రేటుకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్ ధరలో సగం కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సగం మొత్తాన్ని .. బ్యాంకులు రైతులు లోన్‌గా ఇస్తాయి.
సబ్సిడీ ఎవరికి వస్తుందంటే?
ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రైతుకు లోన్ ఇచ్చే బ్యాంకుకే .. కేంద్రం ఈ రాయితీని బదలాయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒక ట్రాక్టర్ ధర రూ. 8 లక్షలు అనుకుందాం. అందులో కేంద్రం రూ. 4 లక్షలు భరిస్తుంది. మరో రూ. 4 లక్షలు బ్యాంకు రైతుకు రుణంగా ఇస్తుంది. రైతు ట్రాక్టర్ కొన్న తర్వాత.. తాను లోన్‌గా తీసుకున్న రూ. 4 లక్షలను వాయిదా పద్ధతిలో (EMI) తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
ఇప్పటికే ట్రాక్టర్ ఉన్నవారికి మళ్లీ ఇస్తుందా?
గడిచిన 7 సంవత్సరాలుగా ట్రాక్టర్ కొనుగోలు చేయని వారికి ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక ఈ స్కీం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. రైతు తనకు ఇష్టం వచ్చిన ట్రాక్టర్‌ను .. తనకు ఇష్టమైన ధరలో .. తనకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. తన సాగు అవసరాలకు తగ్గట్లుగా ఏ ట్రాక్టర్ కొనాలనేది పూర్తిగా రైతు ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.
ఏమేం డాక్యుమెంట్లు కావాలి?
పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసే రైతులు కచ్చితంగా ఈ పత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు కచ్చితం ఉండాలి. పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టు (వీటిల్లో ఏదో ఒకటి), పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో వీలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో అయితే .. కామన్ సర్వీస్ సెంటర్లలో (మీసేవా కేంద్రాలు) దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు అతడు ఉన్న గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వెబ్‌సైట్లో https://pmkisan .gov.in/ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీని కోసం ముందుగా Login ID క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ తర్వాత.. అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఏమైనా అనుమానాలు తలెత్తితే.. రైతుల కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. 155261 / 011-24300606 నంబర్స్‌కు ఫోన్ చేసి మీరు ప్రశ్నలు అడగొచ్చు.
ఏపీ, తెలంగాణలో ఇలా..
ఇదే పథకాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో అడుగు ముందుకేసి వినూత్నంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్.. యంత్రలక్ష్మి పేరుతో అమలు చేస్తూ.. ట్రాక్టర్ సహా వ్యవసాయ పరికరాలు కూడా అదనంగా ఇస్తోంది. మరోవైపు ఏపీ సర్కార్.. వైయస్‌ఆర్ యంత్రసేవ పేరిట అమలు చేస్తోంది. ఈ పథకం కోసం 155251 టోల్‌ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply