భూముల సర్వే గడువు సమీపిస్తుండటంతో సర్వేయర్లకు కష్టాలు రెట్టింపయ్యాయి. గ్రామం పరిధిలో వంద రోజుల్లోగా సర్వే పూర్తిచేసి రికార్డు సిద్ధం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోని వారికి మెమోలు, నోటీసులు అందుతున్నాయి.
పూర్తి చేయడం లేద ని మెమోలు, నోటీసులు
అమరావతి వెళ్లి క్షమాపణ చెప్పాలని హుకుం
రాష్ట్రవ్యాప్తంగా 2,300 మందికి నోటీసులు
భూసర్వే ఒత్తిడిలో సర్వేయర్లు
భూముల సర్వే గడువు సమీపిస్తుండటంతో సర్వేయర్లకు కష్టాలు రెట్టింపయ్యాయి. గ్రామం పరిధిలో వంద రోజుల్లోగా సర్వే పూర్తిచేసి రికార్డు సిద్ధం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోని వారికి మెమోలు, నోటీసులు అందుతున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని, డ్యూటీ సక్రమంగా చేయడం లేదనే కారణాలు చూపిస్తూ గ్రామ, మండల సర్వేయర్లకు చార్జ్‌మెమోలు ఇస్తున్నారు. మరి కొందరికి షోకాజ్ నోటీసులు అందజేస్తున్నారు. ఈ శిక్షలు సరిపోవన్నట్టు కొందరు కలెక్టర్లు.. అమరావతికి వెళ్లి ఉన్నతాధికారులకు క్షమాపణలు కోరాలని సర్వేయర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరిణామం సర్వేయర్లలో అలజడి సృష్టిస్తోంది.
భూముల సర్వేను ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా పూర్తిచేయాని సర్కారు టార్గెట్ విధించింది. కానీ 17 వేలకు గాను 2వేల గ్రామాల్లోనే సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్లు ఇచ్చారు. మిగిలిన 15వేల గ్రామాల్లో ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్లు ఇవ్వాలని సర్కారు పట్టుదలగా ఉంది. ఎన్నికలకు వెళ్లేనాటికి సర్వే పూర్తిచేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గ్రామంలో 100 రోజుల్లోనే సర్వేపూర్తిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వేయర్లు రోజుకు కనీసం 18 గంటలపైనే సర్వేపై దృష్టిపెడుతున్నారు. దీనికి తోడు రెవెన్యూ శాఖ సర్వేయర్లకు రోజువారీ పనులు కూడా అప్పగిస్తోంది. ఇది సర్వే పనులపై ప్రభావం చూపిస్తోంది. ఎస్‌ఓపీ ప్రకారం వంద రోజుల్లోనే సర్వేచేయడం సాధ్యపడటం లే దని, గడువు పెంచాలని సర్వేయర్లు తొలినుంచీ కోరుతున్నారు. అధికారులు సమయం ఇవ్వలేమని చెబతున్నారు. సర్వేయర్లను తొందరపెట్టేందుకు సర్వే పురోగతిలో వెనుకబడిన వారికి తొలుత షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,300 మందికి ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. మరి కొందరికి ఏకంగా మెమోలు జారీ చేస్తున్నారు. సర్వే భారమంతా తమపైనే నెడుతున్నారంటూ సర్వేయర్లు ఆవేదన చెందుతున్నారు. శక్తికి మించి పనిచేస్తున్నా, లక్ష్యాలు పూర్తికావడం లేదని నోటీసులివ్వడం దారుణమని వాపోతున్నారు. రెవెన్యూ సిబ్బందిని వదిలేసి తమపై ఈ నోటీసుల ప్రతాపం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, కొందరు కలెక్టర్లు కొత్తరకం ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలిసింది. షోకాజ్ నోటీసులు అందుకున్న సర్వేయర్లను అమరావతికి వెళ్లి రెవెన్యూ, సర్వే ఉన్నతాధికారులను కలిసి క్షమాపణలు చెప్పిరావాలని, అక్కడి నుంచి తమకు ఫోన్ చేయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. రాయలసీమకు చెందిన ఓ కలెక్టర్ ముగ్గురు సర్వేయర్లను అమరావతికి పంపించారని సమాచారం. ఈ పరిణామాలతో సర్వేయర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
Leave a Reply