రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓ ఖైదీ అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. జీవితఖైదు అనుభవిస్తున్న జోబాబు హఠన్మరణం చెందాడు.
Prisoner Dies with Health Issues in Rajahmundry Central Jail
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సెంట్రల్ జైలులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ అనారోగ్య కారణాలతో కాకినాడ జీజీహెచ్ లో చేరాడు. అక్కడ చికిత్స తీసుకుంటూ గురువారం నాడు మృతి చెందాడు. ఖైదీ మృతి చెందడంతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు దీనిమీద కేసు నమోదు చేశారు. ఖైదీ మృతి విషయంలో జైలు అధికారులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మృతుడి పేరు జోబాబు (55). తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మూరమండ గ్రామ నివాసి. జోబాబుకు ఓ హత్య కేసులో 2002లో జీవిత ఖైదు పడింది. 2002 అక్టోబర్ 23వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన జోబాబుకు హైబీపీ వచ్చి పడిపోయాడు. అతడిని పరీక్షించిన జైలు ఆసుపత్రి వైద్యులు.. వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళమని తెలిపారు.
అక్కడికి వెళ్లిన తర్వాత జోబాబును పరీక్షించిన వైద్యులు హెచ్ టీఎన్, న్యూరాలజీ సమస్యలతో అతడు బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. దీనీ మీద కాకినాడ జిజిహెచ్ వైద్యులు మాట్లాడుతూ జోబాబు తమ ఆసుపత్రిలో పక్షవాతంతో చేరాడని తెలిపారు.
అతనికి నరాల సంబంధిత రుగ్మతలు ఉన్నాయని.. శ్వాస సంబంధిత వ్యాధుల కారణంగానే గుండెపోటు వచ్చి చనిపోయాడని జిజిహెచ్ వైద్యులు తెలిపారు. 2002లో శిక్ష పడిన తర్వాత.. 2008నుంచి ఓపెన్ జైలులో జోబాబు ఉన్నాడు. అక్కడే ఉంటూ జైళ్ల శాఖ పెట్రోల్ బంకులో పనిచేసేవాడు.
Leave a Reply