Ap Ration Shops కు సంబంధించి ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే గోధుమపిండి పంపిణీని కొన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని రేషన్ షాపుల్లో పంపిణీకి విస్తరిస్తామని.. అలాగే రాగులు, జొన్నలు కూడా పంపిణీని కూడా మొదలు పెడతామన్నారు. రాష్ట్రంలో ఇకపై ధాన్యం లోడింగ్ నుంచి గోదాములకు వెళ్లే వరకు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎండీయూ వాహనాలు ఎక్కడున్నాయో ట్రాక్ చేస్తారు.
ప్రధానాంశాలు:
- ఏపీలో రేషన్ షాపులకు సంబంధించి కీలక ప్రకటన
- త్వరలోనే గోధుమ పిండి పంపిణీ రాష్ట్రమంతా విస్తరణ
- రాగులు, జొన్నలు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు
రెండు వారాల్లో చిరుధాన్యాల పంపిణీ మొదలు పెడతామంటున్నారు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. గోధుమపిండి పంపిణీని రాష్ట్రమంతటా విస్తరిస్తామని.. రేషన్ కార్డుదారులు కోరితే నెలకు ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప్రస్తుతం కిలో చొప్పున ఇస్తున్న కందిపప్పునే వారు తీసుకోవడం లేదన్నారు. మంత్రి విజయవాడలో సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు.
ధాన్యం సరఫరా ఎలా జరుగుతుందో మానిటర్ చేయడానికే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు నాగేశ్వరరావు. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుందని.. అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌తో ట్రాక్ చేస్తామన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ధాన్యం లోడింగ్ నుంచి రవాణా, మిల్లుల్లో మర ఆడించి గోదాములకు పంపడం వరకు అన్నీ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే ఎండీయూ వాహనాలు ఎక్కడున్నాయి.. ఇంటింటికి వెళ్తున్నాయో లేదో కూడా తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి.
రాష్ట్రంలో రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని.. ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు నాగేశ్వరరావు. మార్క్‌ఫెడ్ దగ్గర అదనంగా సొమ్ము ఉన్నందునే ఆ సంస్థ నుంచి రూ.3,200 కోట్లను అప్పుగా తీసుకున్నామని.. సివిల్ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమన్నారు. ఖరీఫ్‌లో దళారులు, మిల్లర్లకు సంబంధం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని బాగా సేకరించారని సీఎం ప్రశంసించారన్నారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply