రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. కానీ కొత్త కార్డు కావాలన్నా, మార్పు జరగాలన్నా వివిధ రకాల ధ్రువపత్రాలు, అనుబంధ పత్రాలు కోరడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు.
* పార్వతీపురానికి చెందిన ఎస్.మనోజ్‌కుమార్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇటీవల తన రేషన్ కార్డులో భార్య పేరు చేర్చడానికి వివాహ ధ్రువపత్రంతో సచివాలయానికి వెళ్లగా హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఆమె పేరు లేదని, ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తినే చేర్చగలమని చెప్పడంతో వెనుదిరిగారు. ఉన్నతాధికారులను సంప్రదించగా ఆ రాష్ట్ర ఆధార్‌తో అనుసంధానించి పేరు చేర్చాలని సిఫార్సు చేశారు.
* గరుగుబిల్లి మండలం గొట్టివలసకు చెందిన రాము తాపీమేస్త్రి. ఇతనికి జియ్యమ్మవలస మండలానికి చెందిన యువతితో ఏడేళ్ల కిందట వివాహమైంది. తన కార్డులో భార్య, పిల్లల పేర్లు చేర్చాలని చూడగా వివాహ ధ్రువపత్రం కోరారు. దీని కోసం సబ్‌రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లగా వయసు నిర్ధారణకు ఆధార్‌తో పాటు స్టడీ సర్టిఫికెట్ అడిగారు. దానిని 1998 లో చదివిన పాఠశాలకు వెళ్లి తీసుకొచ్చారు.
* పార్వతీపురం మండలం డోకిశీలకు చెందిన ఓ వ్యక్తి, అతని భార్య విడిపోయి 15 ఏళ్లయింది. కానీ ఇద్దరి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉన్నాయి. ఇటీవల ఆమె పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకోగా ఇద్దరు విడిపోయినట్లు కోర్టు ఇచ్చిన విడాకుల పత్రాలు తీసుకురావాలన్నారు. దీంతో ఆయన న్యాయవాదిని సంప్రదించాల్సి వచ్చింది.
* కొమరాడ మండలం బంజుకుప్పకు చెందిన శ్రీహరి, రాణి దంపతులు. వారికి రేషన్‌కార్డు కావాలని అధికారుల వద్దకు వెళ్లగా వివాహ ధ్రువపత్రం అడిగారు. దాని కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా వయసు నిర్ధారణ కోసం పదో తరగతి ధ్రువపత్రం కోరారు. అమ్మాయి చదువుకోకపోవడంతో వయసు నిర్ధారణ పత్రం అడిగారు. దీనికోసం పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా ఇక్కడ నిపుణులు లేక విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె ఐదు రోజులుగా తిరుగుతోంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ధ్రువపత్రాల కోసం వచ్చిన అర్హులు
పార్వతీపురం, బెలగాం, న్యూస్‌టుడే: రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. కానీ కొత్త కార్డు కావాలన్నా, మార్పు జరగాలన్నా వివిధ రకాల ధ్రువపత్రాలు, అనుబంధ పత్రాలు కోరడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు. కార్డు వస్తుందో లేదో తెలియదు కానీ రోజుల కొద్దీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
గతంలో ఇలా..
* కార్డులో మార్పులకు పెట్టుకున్న దరఖాస్తులను సంబంధిత వీఆర్వోలు పరిశీలించి, నివాస ధ్రువపత్రం మంజూరు చేసేవారు. దీన్ని సంబంధిత కార్యాలయంలో సమర్పిస్తే కుటుంబ సభ్యులుగా గుర్తించి కార్డులో చేర్చేవారు.
* పేరు తొలగించాల్సి వస్తే అందుకు అవసరమైన కారణాలను నిర్ధారించే ధ్రువపత్రం సమర్పిస్తే పని పూర్తయ్యేది.
ఎన్నో అడ్డంకులు
* భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు ప్రభుత్వం పథకాలు అందిస్తోంది. వీటిని పొందాల్సిన వారికి ఒంటరిగా ఉన్నట్లు రేషన్‌కార్డు కావాలి. కానీ చాలా మందికి భర్తతో కలిసి ఉన్న కార్డులే ఉన్నాయి. కొత్త దాని కోసం వెళ్తే విడాకుల ధ్రువపత్రం అడుగుతున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో విడిపోయిన వారికి పత్రాలు తీసుకురావడం భారంగా మారుతోంది.
* కొత్తగా పెళ్లయిన వారి పేర్లను కార్డుల్లో చేర్చాలంటే ధ్రువపత్రం కావాలి. వివాహమై ఏడేళ్లు గడిచిన వారి పేరు చేర్చాలంటే ఇంటింటి సర్వేలో మ్యాపింగ్ జరిగి ఉండాలని చెబుతున్నారు. దీని కోసం వివాహ ధ్రువపత్రం అవసరం. మన్యం ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు చేసుకునే అలవాటు లేకపోవడంతో కొందరు అవస్థలు పడుతున్నారు.
అదనపు ఖర్చు
* వివాహ ధ్రువపత్రం కావాలంటే ప్రభుత్వ చలానాగా రూ.200 చెల్లించాలి. కానీ బయట ఖర్చులు రూ.2 వేల వరకు అవుతున్నట్లు పలువురు చెబుతున్నారు.
* పెళ్లై ఎక్కువ సంవత్సరాలు అయిన వారికి పత్రాలు కావాలంటే దంపతుల విద్యార్హత, స్టడీ సర్టిఫికెట్లు, పెళ్లి ఫొటో, ఆహ్వాన పత్రిక జతచేయాల్సి ఉంటుంది.
* నిరక్షరాస్యులకు వయసు నిర్ధారణ పత్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఎముకల వైద్యుల నుంచి తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో వీరు లేకపోవడంతో విజయనగరం, విశాఖకు వెళ్లాల్సిన పరిస్థితి. దీని కోసం రూ.వేలల్లో ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు. గతంలో పంచాయతీ కార్యాలయంలో పూర్తయ్యే పనుల కోసం ప్రస్తుతం సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది.
సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల వద్ద వివాహ ధ్రువపత్రాల కోసం విదేశాలకు వెళ్లే వారు తప్ప ఇతరులు కనిపించరు. ప్రస్తుతం రేషన్ కార్డు కోసం వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జతచేయాల్సి ఉండటంతో భారీగా వస్తున్నారు.
నిబంధనల మేరకు
రేషన్ కార్డుల విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను ప్రభుత్వం తెలియజేసింది. సంబంధిత ధ్రువపత్రాలు ముందుగా సమర్పిస్తే ఎక్కడా తిరగాల్సిన అవసరం ఉండదు. పత్రాలు లేకపోతే సంబంధిత నోటరీని సమర్పించే వెసులుబాటు కల్పించారు.
కేవీఎల్‌ఎన్ మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి, పార్వతీపురం మన్యం
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply