SIPB Meeting: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని మరోసారి స్పష్టం చేశారు. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టుపైనా చర్చ జరిగింది. 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రధానాంశాలు:
- సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం
- 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలన్న జగన్
- భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం
SIPB Meeting: రాష్ట్రంలో పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పమే లక్ష్యంగా పని చేస్తున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని జగన్ ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశించుకున్న సమయంలోగా కార్యకలాపాలు ప్రారంభం కావాలని YS Jagan Mohan Reddy స్పష్టం చేశారు.
రాష్ట్రంలోకి రానున్న ప్రతి పరిశ్రమలోనూ.. ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఆ చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్, ఫ్యూయెల్స్ కంపెనీ ప్రతిపాదనను పరిశీలించారు. ఈ పరిశ్రమ రూ.498.84 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి కల్పించనుంది. రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యంతో పనులు జరగనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించి.. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ ప్రాజెక్టు విస్తరణ జరగనుంది. మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 2025 నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు కానుంది. ఈ సంస్థ మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్ 2లో 31 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ఇవే కాకుండా.. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు, అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ, విండ్, సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లు, వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ పార్కు ఏర్పాటుపై.. ఎస్ఐపీబీ సమావేశంలో చర్చించారు. వీటి ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆ మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఇంకా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను.. పెట్టుబడిదారులకు వివరించాలని.. మంత్రులు, అధికారులకు సూచించారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply