Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులంతా ఎన్నికల బరిలో దిగి తమ భవిష్యత్తును పరిక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ నిరుద్యోగ యువతి నామినేషన్ వేసి.. ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. ఆమె ఎవరో కాదు మనందరికి ఎంతో సుపరిచితమైన “బర్రెలక్క..”
Sirisha Alias Barrelakka Filed Nomination From Kollapur Constituency In Telangana Assembly Elections
ప్రధానాంశాలు:
- తెలంగాణ ఎన్నికల బరిలో దిగిన బర్రెలక్క
- కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
- ఇన్ స్టా రీల్స్‌తో ఫేమస్ అయిన నిరుద్యోగ యువతి
Telangana Assembly Elections 2023: “హాయ్ ఫ్రెండ్స్.. బర్లు కాయనికి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివిన కానీ డిగ్రీలు డిగ్రీలు పట్టాలొస్తున్నాయి గానీ.. జాబులు మాత్రం వస్తలేవ్వు.. నోటిఫికేషన్ వెయ్యరు ఏం వెయ్యరు.. అందుకే మా అమ్మను అడిగి.. నాలుగు బర్రెలు కొన్నా..” అంటూ ఓ అమ్మాయి చెప్పే వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది గుర్తుందా. బర్రెలక్కగా తెగ ఫేమస్ అయిపోయిన ఈ యువతి ఇప్పడు తెలంగాణలోని ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. నిరుద్యోగ యువతిగా ఇన్‌స్టా గ్రాంలో ఓ చిన్న సెటైరికల్ వీడియోతో ప్రభుత్వంపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శిరీష.. అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది.
తెలంగాణ నిరుద్యోగినిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినట్టు బర్రెలక్క తెలిపింది. అయితే.. తాను అన్ని పార్టీల అభ్యర్థులలాగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేకపోవచ్చని.. డబ్బు పంచలేకపోవచ్చని తెలిపింది. కానీ ప్రజలు ఏది మంచి ఏది చెడు ఆలోచించాలని… తన ప్రజల సపోర్ట్ ఉంటుందని శిరీష విజ్ఞప్తి చేసింది.
అయితే.. ప్రభుత్వ ఉద్యోగాలను అప్లై చేసుకుని, కోచింగ్ కూడా తీసుకుని కష్టపడి చదివినా నోటిఫికేషన్లు రాకపోవటంతో.. ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని శిరీష ఓ చిన్న వీడియో ద్వారా చెప్పి దాన్ని ఇన్ స్టాలో సరదాగా పోస్ట్ చేసింది. అయితే.. ఆ సమయంలో శిరీష వీడియోను నిరుద్యోగులతో పాటు ప్రతిపక్షాలు కూడా వైరల్ చేసి.. ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీంతో.. ఆ వీడియోతో పాటు అందులో ఉన్న శిరీష కూడా రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది.
అప్పటివరకు ఆమె ఇన్ స్టాలో సరదాగా పెట్టే వీడియోలకు డబుల్ డిజిట్, త్రిబుల్ డిజిట్‌లో మాత్రమే వచ్చే వ్యూస్ కాస్త.. అమాంతం పెరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి.. ఆ వీడియో ఇచ్చిన బూస్ట్‌తో అటు ఇన్ స్టాతో పాటు ఇటు యూట్యూబ్‌లో బర్రెలక్క పేరుతో రెగ్యూలర్‌గా వీడియోలు చేస్తూ.. తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల బరిలో దిగి.. ఇంకేంత ఫేమస్ కానుందో.. చూడాలి మరి.
ఇదిలా ఉంటే.. కొల్లాపూర్ బరిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తున్నారు ఇక బీజేపీ నుంచి అల్లేని సుధాకర్ రావు బరిలోకి దిగుతున్నారు.
Leave a Reply