Harish Rao: తెలంగాణలో కొత్తగా ఎలాంటి పన్నులు తీసుకొచ్చే యోచనలో తమ ప్రభుత్వం లేదని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో తన కేటాయింపుల ద్వారా నిరూపించారు.
Telangana Finance Minister T Harish Rao Clarified Over Double Bedroom Scheme Along with New Scheme
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి అనేక మందికి లబ్ధి చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ తో పాటే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఒక్కసారి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కొనసాగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
కొత్తగా తీసుకొస్తున్న హౌసింగ్ స్కీమ్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సొంతగా స్థలం ఉండి ఇల్లు కట్టుకుందామనుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతంలోని వారికి ఈ స్కీమ్ కింద రూ.5 లక్షలు గ్రాంట్ రూపంలో అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాధించింది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం HUDCO నుంచి రూ.12,000 కోట్లను పొందనున్నట్లు తెలిపింది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం దీనికి సంబంధించి కేటాయింపులపై ప్రకటన చేసింది.
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘స్పోర్ట్స్ పాలసీ’ ముసాయిదా సిద్ధమైంది. త్వరలోనే దీనిని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదే క్రమంలో వేతన సవరణ సంఘం బకాయిలను త్వరలో క్లియర్ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే మూడు డీఏలు ఇచ్చామన్న హరీష్ రావు.. మిగిలిన డీఏలపై తెలంగాణ కేబినెట్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.