రుణమాఫీ పథకం అమలుపై అంతా అయోమయం నెలకొంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెబుతున్న లెక్కలకు.. వాస్తవ లెక్కలకు పొంతన కుదరడం లేదు. తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.90వేల వరకు ఉన్న రుణాల మాఫీకి సరిపోతాయని మంత్రులు చెబుతున్నారు.
రుణమాఫీ పథకం అమలుపై అంతా అయోమయం నెలకొంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెబుతున్న లెక్కలకు.. వాస్తవ లెక్కలకు పొంతన కుదరడం లేదు. తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.90వేల వరకు ఉన్న రుణాల మాఫీకి సరిపోతాయని మంత్రులు చెబుతున్నారు.వారు చెప్పినట్లు ఈ నిధులే సరిపోతాయనుకున్నా… రూ.90 వేల నుంచి రూ.లక్ష కేటగిరీలో ఉన్న రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో 2023-24 బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.20వేల కోట్ల పైచిలుకు నిఽధులు కేటాయిస్తారని, నాలుగేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తారని… రైతులతోపాటు వ్యవసాయ శాఖ అధికారులూ ఆశించారు. కానీ, తాజా బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రుల ప్రకటనలు.. అటు రైతులతోపాటు ఇటు అధికారులనూ అయోమయానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా పంట రుణాలకు సంబంధించి రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకునే రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా రూ.37వేల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగా… లబ్ధిపొందిన రైతుల సంఖ్య 5,42,609 మాత్రమే.
ఇందుకోసం వెచ్చించింది కేవలం రూ.1,206 కోట్లే. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన లెక్క ప్రకారమే… రుణమాఫీ పథకానికి రూ. 21,557 కోట్లు అవసరమవుతాయి. ఇందులో రూ. 1,206 కోట్లు మినహాయిస్తే ఇంకా రూ. 20,351 కోట్లు అవసరమవుతాయి. కానీ, ఈ బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు మాత్రమే సర్కారు కేటాయించింది. వీటిని కూడా మినహాయిస్తే… ఇంకా రూ.13,966 కోట్లు తక్కువవుతాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ముగిసిపోలేదని, గత బడ్జెట్(2022- 23)లో చేసిన కేటాయింపులు ఉన్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తాజాగా అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఎన్ని నిధులు విడుదల చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రూ.90వేల వరకే నిధుల సర్దుబాటు
రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ రూ.37వేల వద్దే నిలిచిపోయింది. రూ. 37వేల నుంచి రూ.50 వేల కేటగిరీలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయడానికి రూ.వెయ్యి కోట్లకుపైగా అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, రూ.50-75 వేల కేటగిరీలో ఉన్న రైతులకు రూ.4వేల కోట్లు అవసరమవుతాయి. మొత్తంగా రూ.5వేల కోట్ల వరకూ ఖర్చు పెడితే.. రూ.75వేల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇదే జరిగితే కీలకమైన, రైతుల సంఖ్య ఎక్కువగా ఉండే నాలుగో కేటగిరీకి నిధులు ఎలా సరిపోతాయి? అసెంబ్లీలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డిలు ప్రకటించినట్లు రూ.90వేల వరకు రుణమాఫీ పూర్తవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారు చెప్పినట్లు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.90వేల వరకు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయడానికి సరిపోతాయనుకున్నా… రూ.90 వేల నుంచి రూ.లక్ష కేటగిరీలోని రైతుల సంగతేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రుణమాఫీ పూర్తి చేయకపోతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనడంలో సందేహం లేదు. చివరి కేటగిరీలో (రూ. 90 వేల నుంచి రూ.లక్ష వరకు) ఉండే రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. గత టర్మ్‌లో రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 35.32 లక్షలు. ఆ లెక్కలనే పరిగణనలోకి తీసుకొని చూసినా… ఇప్పటికీ 30 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.
రూ.37 వేల నుంచి రూ.90 వేల వరకు లెక్క తీస్తే… 5 లక్షల నుంచి 10 లక్షల మంది రైతులు ఉండే అవకాశాలున్నాయి. ఈ మేరకు చివరి కేటగిరీలో తక్కువలో తక్కువగా 20లక్షల మంది రైతులు మిగిలిపోతారు. అంటే సుమారుగా 50శాతం మందికి ఈ ఏడాది రుణమాఫీ సాధ్యం కాదు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న రైతులకు రుణ మాఫీ పూర్తి చేయకపోతే పరిస్థితి ఏమిటన్న చర్చ సాగుతోంది. రుణమాఫీ పథకాన్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయకపోటంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 16లక్షల మంది డిఫాల్టర్ల జాబితాలో ఉన్నారు. ఫలితంగా కొత్త రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
కేటాయింపులు ఘనం.. విడుదల స్వల్పం
రుణమాఫీకి బడ్జెట్‌లో చేస్తున్న కేటాయింపులు, విడుదల చేస్తున్న నిధుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి. ఈ పథకానికి నాలుగేళ్లలో విడుదల చేసిన నిధులు రూ.1,206 కోట్లే. 2019- 20 లో రూ.4,528 కోట్లు కేటాయించినా… నయా పైసా విడుదల చేయలేదు. 2020-21 లో రూ.6,225 కోట్లు కేటాయించి… రూ.409కోట్లే ఇచ్చారు. 2021- 22లో రూ.5,225 కోట్లు కేటాయించి… రూ.354 కోట్లు విడుదల చేశారు. 2022- 23లో రూ.4వేల కోట్లు కేటాయించి… రూ.443 కోట్లు ఇచ్చారు. తాజా బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించినా… ఏ మేరకు నిధులు విడుదల చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే… రుణమాఫీని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20,351 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply