సినిమా, రైల్వే, మెట్రో, బస్ టికెట్‌లను ముందుగానే బుక్ చేసుకునే తరహాలోనే తాము ఓటు వేయదలచుకున్న సమయాన్ని కూడా ఓటర్లు యాప్ ద్వారా..
Bruhat Bengaluru Mahanagara Palike to Introduce a Special App for Voting for Very Soon
సిలికాన్ సిటీగా ప్రసిద్ధి పొందిన బెంగళూరు నగరంలో ఓటు వేసేందుకు ఇకపై పెద్ద క్యూలలో నిలబడాల్సిన పనిలేకుండా బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. సినిమా, రైల్వే, మెట్రో, బస్ టికెట్‌లను ముందుగానే బుక్ చేసుకునే తరహాలోనే తాము ఓటు వేయదలచుకున్న సమయాన్ని కూడా ఓటర్లు యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా యువత ఓటింగ్‌కు ఆసక్తి కనబర్చే అవకాశం ఉందని.. బెంగళూరులో ఓటింగ్ శాతాన్ని అదనంగా మరో 10శాతం అయినా పెంచేందుకు ఈ యాప్ బాగా దోహదపడుతుందని బీబీఎంపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓటింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపని యువతను దృష్టిలో ఉంచుకునే ఈ యాప్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ యాప్‌ను వినియోగించాలన్న ప్రతిపాదన ఉందని, ఎన్నికల సంఘం అధికారులతో చర్చిస్తున్నామని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓటింగ్ శాతం గరిష్టంగా 55గా ఉందని దీన్ని కనీసం 65 నుంచి 70శాతానికి పెంచాలన్న లక్ష్యంతోనే ఈ యాప్‌ను రూపొందించామన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా పింక్ పోలింగ్ బూత్‌ల తరహాలోనే సోలార్ పవర్‌తో పనిచేసే గ్రీన్ పోలింగ్ బూత్‌ల పరికల్పనను కూడా బీబీఎంపీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Leave a Reply